RX 100`లాగానే `గుణ 369` హిట్ కావాలి – దిల్‌ రాజు

159

`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా , అనఘ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం `గుణ 369`. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ – ఆర్‌.ఎక్స్ 100` హీరో కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `గుణ 369`. నిర్మాతలుగా అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి తొలి ప్రయత్నమిది. ఈ సినిమాలో తొలి సాంగ్ `తొలి పరిచయమా..`ను నేను విడుదల చేశాను. మంచి మెలోడీ సాంగ్‌. ఫీల్ గుడ్ సాంగ్‌, అందరికీ నచ్చుతుంది. కమల్‌హాసన్‌గారి `గుణ`.. బాలకృష్ణగారి `ఆదిత్య 369` సినిమాల రెండు టైటిల్స్ సగం సగం కలిసి చక్కగా కథకు తగ్గట్టు `గుణ 369` అనే టైటిల్ కుదిరింది. టైటిల్‌లోని 369 ఏంటో ట్రైలర్‌ను చూడగానే అర్థమైంది. ట్రైలర్ బావుంది. కార్తికేయకు, టీమ్‌కు `ఆర్‌.ఎక్స్ 100`లా సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “ఇదేదో వండి వార్చిన కథ కాదు. జరిగిన కథ. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది. తప్పక ప్రతి వారికీ కనెక్ట్ అవుతుంది. ఇదివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు.అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కథ ఇది. `తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది…` అనే తొలి పాటను గురువారం `దిల్‌`రాజుగారి చేతుల మీదుగా విడుదల చేశాం. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన బాణీ వినగానే ఆకట్టుకుంటోంది. గేయ రచయిత విశ్వనాథ్ తేలిక పదాలతో మంచి భావంతో ఈ పాట రాశారు. తప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజల్లోకి వెళ్తుంది“ అని అన్నారు.

నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ “టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఏస్ ప్రొడ్యూసర్ `దిల్‌` రాజుగారి చేతుల మీదుగా మా `గుణ 369` చిత్రంలోని తొలి పాట విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది . గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండదని నమ్ముతున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు చైతన్ భరద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ట్యూన్లు వినేకొద్దీ వినాలనిపిస్తున్నాయి. మేం గురువారం విడుదల చేసిన `తొలి పరిచయమా ఇది… తొలి పరవశమా ఇది…` అనే పాట విన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతుంది. విశ్వనాథ్ రాసిన పదాలు కూడా ప్రేమికుల మనసుకు ఇట్టే దగ్గరయ్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలోనూ యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాకు సర్వత్రా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ `గుణ 369` చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం“ అని అన్నారు.

గాయకుడు హరిచరణ్ మాట్లాడుతూ “మంచి బాణీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. నా మిత్రుడు చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన `తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది…` అనే పాట మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉంది. విశ్వనాథ్ లిరిక్స్ కూడా ట్రెండీగా ఉన్నాయి. అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను“ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here